ఉత్తరాఖండ్ ఘటన : సహాయక చర్యలు తిరిగి ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలప్రళయం సంభవించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది.  ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది.

ఈ నది ఒడ్డున తపోవన్‌-రేణి వద్ద ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలోని తపోవన్‌-విష్ణుగద్‌ 480 మెగావాట్‌ల జలవిద్యుత్తు కేంద్రంలో కూడా నీరు ప్రవహించింది. ”దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఎనిమిది మరణించారు. నిన్న 16 మంది కార్మికులను ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించిన విషయం తెలిసిందే. మరో 14 మంది మృతదేహాలను గుర్తించారు.

మరికొంత మందిని రక్షించేందుకు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సొరంగాల్లో భారీ స్థాయిలో మట్టి పూడుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ధౌలీ గంగ నీటి మట్టం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగించింది. దీంతో రాత్రి రద్దు చేసిన సహాయక చర్యలు తిరిగి ఉదయం పునరుద్ధరించారు. మరో 30 మంది సొరంగాల్లో చిక్కుకున్నట్లు తమకు సమాచారం ఉందని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ పాండే తెలిపారు.