రెండో టెస్ట్’కు ప్రేక్షకులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే !

కరోనాతో గత యేడాది భారత్ లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్-13ని విదేశాలకు తరలించారు. దుబాయ్ లో నిర్వహించారు. అక్కడా ప్రేక్షకులని అనుమతించలేదు. ఇక ఇంగ్లాండ్‌ సిరీసుతోనే క్రికెట్‌ ఆరంభమైంది. ఆంక్షలు ఉండటంతో చెపాక్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు అభిమానులను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించడంతో రెండో టెస్టు నుంచి వీక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. దాదాపు 15వేల మందికి మ్యాచును వీక్షించే అవకాశం ఉంది. అయితే రెండో టెస్ట్ కు రానున్న ఫ్యాన్స్ నిబంధనలు పాటించాల్సిందే.

మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్‌ లక్షణాలుంటే లోనికి అనుమతించరు అని తమిళనాడు క్రికెట్‌ సంఘం తెలిపింది. వీక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతి వివక్ష, మత వివక్ష, అశ్లీల పదజాలం ఉపయోగించకూడదని పేర్కొంది. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్‌ పాయింటర్లు, డిజిటల్‌ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్‌ రికార్డర్లు, రికార్డింగ్‌ పరికరాలు, బైనాక్యులర్లు, రిమోట్‌ నియంత్రిత వస్తువులు, మందుగుండు సామగ్రి, సంగీత పరికరాలు, స్పీకర్లు, ప్రొఫెషనల్‌/వీడియో కెమేరాలు తీసుకురావడం నిషేధం అని తెలిపారు.