కొత్త పార్టీ ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

తెలంగాణలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ షర్మిల పార్టీ ఏర్పాటు పనులని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో లోటస్ పాండ్ లో సమావేశంనిర్వహించింది. ఇదే విధంగా మిగితా జిల్లాల నేతలతోనూ సమావేశం కానున్నారు.

నల్గొండ జిల్లా నేతలతో సమావేశం అనంతరం షర్మిలా మీడియాతో మాట్లాడారు. “ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్‌ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడా. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా” అని షర్మిల తెలిపారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ ఇచ్చినట్టయింది. 

ఇక షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్‌ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిలని అసలు పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరీ.. నిజంగానే అన్న జగన్ పై కోపంతో తనకంటూ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేస్తున్నారా ? లేక నిజంగానే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలనే తాపత్రయంతో వస్తున్నారా ?? అన్నది.. ఆ దేవుడి ఎరుక.