షర్మిలకు హరీశ్ రావు కౌంటర్

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణలోనే కొత్త పార్టీ ఎందుకు  ? అని ప్రశ్నిస్తే.. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా ? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా ? పక్కా ఇళ్లు ఇచ్చారా ? అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతుంది అన్నారు. ఈ నేపథ్యంలో తెరాస నేతల నుంచి షర్మిలకి కౌంటర్లు పడుతున్నాయి. మంత్రి హరీష్ రావు కూడా పరోక్షంగా షర్మిలకు కౌంటర్ ఇచ్చారు.

‘ఎక్కడి నుంచో ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది’ అని మాట్లాడుతున్నారని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి మాట్లాడారు. కొందరు ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా ? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో ఎకరానికి రూ.10వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు. హరీష్ తన నోటితో షర్మిల పేరు పలకకపోవడం విశేషం. అనవసరంగా ఆమెని ప్రమోట్ చేసినట్టు అవుతుందని హరీష్ భావించి ఉంటారేమో.. !