కుల్‌దీప్‌ ని కావాలనే కోహ్లీ పక్కకు పెట్టాడా ?

టీమిండియాలో ఆటగాళ్ల పట్ల పక్షంపాతం కొనసాగుతుందా ? అనే విమర్శలొస్తున్నాయ్. దీనికి కారణం.. మణికట్టు మాంత్రికుడు, చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు చాలాకాలంగా జట్టులో చోటు దొరకడమే. కుల్ దీప్ ని టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ తుది జట్టులోకి తీసుకోవడం లేదు. ఆస్ట్రేలియా సిరీసులో సీనియర్లు లేనప్పటికీ అవకాశం దొరకలేదు. చెపాక్‌ టెస్టులోనూ అతడిని రిజర్వు బెంచీకే పరిమితం చేశారు. 

ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కుల్ దీప్ పట్ల కెప్టెన్ కోహ్లీ పక్షపాతం వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయ్. టీమ్‌ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. సారథి విరాట్‌ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. కుల్ దీప్ ని కాదని నదీమ్ ని తీసుకోవడం వెనక ఓ ప్లాన్ ఉందని వివరించారు.

శ్రీలంకలో ఎడమ చేతివాటం బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడ్డారని గణాంకాలు చూపిస్తున్నాయి. ఆ సిరీస్‌లో వారు గెలిచినప్పటికీ ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు. అందుకే జట్టు యాజమాన్యం నదీమ్‌కు ప్రాధాన్యం ఇచ్చి ఉంటారని తెలిపారు.