ఇలా.. కోహ్లీ డకౌటవ్వడం ఇదే తొలిసారి !

టీమిండియా కెప్టెన్ స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడతాడు. కోహ్లీ స్పిన్నర్ కు చిక్కిన సందర్భాలు చాలా తక్కువ. అందులోనూ.. ఇంతవరకు స్పిన్నర్ చేతిలో కోహ్లీ డకౌటవుట్ కాలేదు. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ కూడా అనూహ్యంగా స్పిన్నర్ చేతిలో డకౌటయ్యాడు.

జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద పుజారా(21) ఔటైన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే, కోహ్లీ ఇలా స్పిన్నర్‌ చేతిలో డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 26 సార్లు అతడు సున్నా పరుగులకే ఔటయ్యాడు. కానీ అందులో ఒక్కసారి కూడా ఏ స్పిన్నర్‌ చేతిలో ఔటవ్వలేదు. దీంతో కోహ్లీని డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా మోయిన్‌ అలీ నిలిచాడు.

ఇక రెండో టెస్టులో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో బ్యాట్‌తో అదరగొట్టి బంతితో విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు నదీమ్‌కు బదులు ఈ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకున్నారు. పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకున్నారు.