కొత్త బార్లకు డ్రా.. లైన్ క్లియర్ !


మందు బాబులని ఎన్నికల సంఘం కూడా నిరాశపరచలేదు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 159 బార్లకు లైన్‌ క్లియరైంది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతులు ఇచ్చింది. కొత్త బార్లకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఈ నెల 16 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. 159 బార్లకు 8464 దరఖాస్తులు వచ్చాయి.

మొత్తం బార్లకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా తీయడం తప్పనిసరైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 55 బార్లకు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సమక్షంలో ఈ నెల 18న, జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నెల 19న లక్కీ డ్రా తీస్తామంటూ డైరెక్టర్‌ ప్రకటించారు. కానీ.. ఈ నెల 11న హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది.

కోడ్‌ అమల్లోకి రావడంతో బార్లకు డ్రా నిర్వహించడాన్ని అనుమతించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి సర్కారు లేఖ రాసింది. సీఈఓ కూడా 15న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖానుసారంగా బార్ల డ్రాకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈరోజు, రేపు కొత్త బార్లకు సంబంధించిన డ్రా తీయనున్నారు.