MLC – కొత్త అర్థం చెప్పిన బండి సంజయ్
కేసీఆర్ సర్కార్ కు ముచ్చటగా మూడో షాక్ ఇచ్చేందుకు తెలంగాణ భాజాపా రెడీ అవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లోనూ తెరాసకు భాజాపాకి బ్యాక్ టు బ్యాక్ షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోసారి తెరాసకు చుక్కులు చూపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
గురువారం యాదాద్రి-భువనగిరిలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. భాజాపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమందర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనన్నారు. సీఎం పదవిని కేసీఆర్ చెప్పుతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీమ్ అక్రమ ఆస్తులు మెక్కిన కేసీఆర్ చేత అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు.
యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి పక్కన కేసీఆర్ ఫొటో ఎప్పుడూ పెట్టమన్నాడో, అప్పటి నుంచే ఆయన డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. న్యాయవాది వామనరావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. ఇప్పటివరకు సీఎం స్పందించక పోవడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో 70 వేలు బాకీ ఉందన్నారు.