వరంగల్‌లో రైల్వే కోచ్‌ రద్దు.. తెరాస నిర్లక్ష్యమే

హన్మకొండలో పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశానికి కేంద్ర మంత్రి, తెలంగాణ భాజాపా సీనియర్ నేత కిషన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై భాజపా శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. అమృత్‌ సిటీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్‌ సిటీ కింద వరంగల్‌కు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. భాజపా వల్లే వరంగల్‌ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు.


వరంగల్‌కు రింగురోడ్‌ను కూడా భాజపా ప్రభుత్వమే కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు జాప్యం జరిగిందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. 2016లో వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కేటాయించారని.. ఇందుకోసం 125 ఎకరాలు అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్ర వాటా నిధులను తెరాస ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సరైన సమయంలో తెరాస భూమిని కేటాయించినట్లయితే నేరుగా వెయ్యి మందికి, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించేవని చెప్పారు.