ఆరేళ్ళ అసమర్థ పాలనకు చరమగీతం పాడే టైమొచ్చింది

పట్టభద్రులు ఇచ్చే తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు కావాలన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం. శనివారం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరేళ్ళ అసమర్థ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. పీఆర్సీ అమలు లేదు. రైతుల ఋణాలు మాఫీ కాలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఊసే లేదని ఫ్రొపెసర్ మండిపడ్డారు. 


ఆస్తులు పెంచుకోవడం తప్ప, అభివృద్ధి జాడే లేదని విమర్శించారు. ఉద్యమ కారులకు కనీస గుర్తింపు లేదన్నారు. అధికార పార్టీ నేతలు పట్టభద్రులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక దందాలు, భూ కబ్జాలు, అవినీతే ఎజెండాగా టీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పట్టభద్రులు ఇచ్చే తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు కావాలని కోదండరాం పిలుపునిచ్చారు.

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి కోదండరామ్ బరిలో ఉన్నారు. ఆయనకి బలమైన ప్రత్యర్థులుగా తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాణి రుద్రమదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే కోదండరామ్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లోనూ మంచి  నమ్మకం ఉన్నా.. ఆయన స్తబ్ధుగా ఉండటం మైనస్ గా మారింది. నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై దూకుడుగా మాట్లాడే తీన్మార్ మల్లన్న, రుద్రమదేవి వైపే పట్టభద్రులు మొగ్గు చూపిస్తున్నారని సమాచారమ్.