హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం
తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు కూడా నమ్ముతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరుని భాగ్యనగర్ గా మారుస్థామని గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ పేరు మార్పుపై బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు కూడా స్పందించారు.
కచ్చితంగా హైదరాబాద్ పేరుని భాగ్యనగర్ గా మారుస్తాం. ఈ విషయంలో తమని ఎవరు కూడా అడ్డుకోలేరని మురళీధర్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మురళీధర్ రావు హైదరాబాద్ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ విషయంలో ప్రజల మద్దతుని కూడా కూడగడతాం. కేవలం నగర పేరును మార్చడం మాత్రమే తమ ఉద్దేశం కాదని, సమాజంలో సైద్ధాంతిక మార్పును కూడా తీసుకువస్తామని ఆయన తెలిపారు.