‘సారంగ దరియా’ వివాదంపై శేఖర్ కమ్ముల స్పందన
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘సారంగ దరియా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఈ పాట విషయంలో వివాదం రాజుకుంది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా.. పవన్ స్వరాలు అందించారు. మంగ్లి పాడారు. అయితే, పాటను తానే వెలుగులోకి తీసుకొచ్చానని.. తనతో పాడిస్తానని చెప్పి మరొకరితో పాడించారంటూ కోమలి అనే జానపద గాయని మీడియాకు ఎక్కింది. దీంతో గత కొద్దిరోజులుగా సారంగ దరియా వివాదం నలుగుతూనే ఉంది.
తాజాగా ఈ వివాదానికి దర్శకుడు శేఖర్ కమ్ముల పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ వివాదం గురించి పూర్తిగా వివరించిన శేఖర్ కమ్ముల.. కోమలికి న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. చాలా ఏళ్ల క్రితం ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి ఈ పాట పాడిందని శేఖర్ కమ్ముల గుర్తు చేశారు. ఆ పాట లవ్ స్టోరీ కోసం రాయాలని సుద్దాల అశోక్ తేజను కోరాం. శిరీషతోనే పాటను పాడిద్దామని అనుకున్నాం. కానీ ఆ సమయంలో ఆమె గర్భిణి కావడంతో వద్దనుకున్నామని తెలిపారు.
అయితే, ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మాయి కోమలి కావడంతో ఆమెతో పాడిద్దామని సుద్దాల అన్నారని గుర్తు చేశారు. దీంతో వరంగల్ నుంచి ఆమెను రమ్మని కోరామని, అందుకు ఏర్పాటు కూడా చేశామన్నారు. అయితే, జలుబు, దగ్గు కారణంగా తాను రాలేనని కోమలి చెప్పారు. మరోవైపు పాట రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు అప్పటికే చెన్నై నుంచి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంగ్లీతో పాడించామని వివరించారు. కోమనిలి ఆడియో ఫంక్షన్ కి పిలిచి గౌరవిస్తాం. ఆడియో వేదికపై ఆమెతో పాటని పాడిస్తాం. అంతేకాదు.. ఆమెకు తగిన మొత్తం ఇస్తామని శేఖర్ కమ్ముల తెలిపారు. దీంతో సారంగ దరియా వివాదానికి పులిస్టాప్ పెట్టినట్టయింది.