రివ్యూ : శ్రీకారం

చిత్రం : శ్రీకారం (2021)

నటీనటులు : శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్

సంగీతం : మిక్కీ జె మేయర్

దర్శకత్వం : కిషోర్

నిర్మాత : రామ్ ఆచంట, గోపీ ఆచంట.

రిలీజ్ డేటు : 11 మార్చి, 2021.

యువత వ్యవసాయం చేయడం ట్రెండ్ గా మారింది. కరోనా విజృంభణతో సొంతూరు వెళ్లిన యువత వ్యవసాయం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత వ్యవసాయం నేపథ్యంలో సినిమాలు క్యూ కడుతున్నాయ్. ఆధునిక వ్యవసాయంపైకథలు వస్తున్నాయ్. శర్వానంద్ తాజా చిత్రం శ్రీకారం కూడా ఇదే జోనర్ లో తెరకెక్కింది. కొత్త దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శర్వాకి జంటగా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. మహా శివరాత్రి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీకారం ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

కార్తీక్ (శ‌ర్వానంద్‌) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. ఉద్యోగంలో ప్ర‌మోషన్ కూడా సంపాదిస్తాడు. త‌న తండ్రి కేశ‌వులు (రావు ర‌మేష్‌) కుటుంబం కోసం చేసిన అప్పుల్ని కూడా తీర్చేస్తాడు. కొడుకు త‌న‌లా వ్య‌వ‌సాయం చేయ‌కుండా సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్నందుకు కేశవులు సంతోషిస్తాడు. అమెరికా వెళ‌తాడంటూ గొప్ప‌లు చెప్పుకుంటుంటాడు. కానీ కార్తీక్.. త‌న‌తండ్రికి షాక్ ఇస్తూ వ్య‌వ‌సాయం చేస్తానంటూ ఉద్యోగాన్ని వ‌దిలి ఊరికొచ్చేస్తాడు.

ప్రేమించిన అమ్మాయి ఛైత్ర (ప్రియాంక అరుళ్ మోహ‌న్), ఆమె తండ్రి వారించినా వినిపించుకోడు. ఊరంతా క‌లిసి వ్య‌వ‌సాయం చేద్దామ‌ని పిలుపునిస్తాడు. మ‌రీ అది సాధ్య‌మైందా? అందుకోసం కార్తీక్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ ? అన్నది పూర్తి కథ.

ఎలా సాగిందంటే ?

‘రాబోయే ట్రెండ్ వ్య‌వ‌సాయ‌మే’ అంటూ యువ‌త‌రానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇలాంటి విష‌యాల్ని సినిమా ద్వారా చెప్ప‌డం సాహ‌స‌మే. కానీ దర్శకుడు ట్రెండ్‌కి త‌గ్గ పాత్ర‌లు, క‌థ‌ల్లో ఇలాంటి సామాజికాంశాల్ని మేళ‌విస్తూ కథని అద్భుతంగా చెప్పాడు. ఈ క‌థ, పాత్ర‌ల్ని అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు.
పుట్టి పెరిగిన ఊళ్ల‌ల్లో ఏం చేయాలో తెలియ‌క‌… ప‌ట్నంలో ఉండ‌లేక నేటి యువ‌త‌రం గ‌డుపుతున్న జీవితాల్ని గుర్తు చేస్తూ క‌థ‌లో ప్రేక్ష‌కుల్ని లీనం చేస్తాడు ద‌ర్శ‌కుడు. గ్రామీణ జీవితాలు, అక్క‌డి ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఈ స‌న్నివేశాల‌కి ఎవ‌రైనా క‌నెక్ట్ కావ‌ల్సిందే.

ఎవరెలా చేశారంటే ?

శర్వానంద్ ఆల్ రౌండర్. చేసిన పాత్రలో లీనమైపోతాడు. భావోద్వేగాల్ని పండించ‌డంలో తాను బెస్ట్ అని శర్వా మ‌రోసారి నిరూపించాడు  పాత్ర‌లో స‌హ‌జంగా ఒదిగిపోయాడు. హీరోయిన్ ప్రియాంక‌తో ల‌వ్ ట్రాక్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ప్రియాంక అరుళ్ మోహ‌న్ అందంగా క‌నిపిస్తూ ప‌క్కింటి అమ్మాయిని గుర్తు చేస్తుంది. 

రావు ర‌మేష్ తండ్రి పాత్ర‌లో చ‌క్క‌టి భావోద్వేగాలు పండించారు. న‌రేష్ ప‌ల్లెటూరి రైతుగా మంచి పాత్ర‌లో క‌నిపిస్తారు. సాయికుమార్ ఏకాంబ‌రం పాత్ర‌లో చేసిన సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. స‌త్య పండించిన హాస్యం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు. గ్రామీణ నేపథ్యంలో.. ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీకారం యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉంది.

సాంకేతికంగా : 

ద‌ర్శ‌కుడు కిషోర్ ఇది తొలి సినిమానే. కానీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెప్పారు. మిక్కీ నేప‌థ్య సంగీతంతోపాటు పాట‌లు బాగున్నాయి. యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం బాగుంది. ప‌ల్లెటూరి అందాల్ని మ‌రింత అందంగా చూపించారు. సాయిమాధ‌వ్ బుర్రా అందించిన మాటలు బాగా పేలాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ – కథనం
దర్శకత్వం
శర్వానంద్ నటన
సంభాషణలు
సెకాంఢాఫ్

మైనస్ పాయింట్స్ :
మొదట్లో వచ్చే సీన్స్ రొటీన్ గా అనిపించడం
కొన్ని సినిమాలతో పోలిక అనిపించడం

ఫైనల్ గా : శ్రీకారం.. అందరూ నచ్చే సినిమా

రేటింగ్ : 3/5