మిథాలి @10,000
టీమ్‌ఇండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు సాధించారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి చార్లెట్ ఎడ్వర్డ్స్ 10,273 పరుగులతో తొలి స్థానంలో నిలవగా, మిథాలి రాజ్ 10,001 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆపై న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(7,849), వెస్టిండీస్ బ్యాటర్ స్టిఫానీ టేలర్(7,816), ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ (6,900) పరుగులతో వరుసగా ఉన్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలి (36; 50 బంతుల్లో 4×4) పరుగులు చేసి అన్నేబాష్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయి చేరుకున్నారు. 1999లో టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టిన మిథాలి సుదీర్ఘకాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో అడుగుపెట్టిన ఆమె 10 మ్యాచ్‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలున్నాయి.
ఇక వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలి 6,974 (ఈ మ్యాచ్‌తో కలిపి) పరుగులు సాధించారు. అందులో ఏడు శతకాలు, 54 అర్ధశతకాలున్నాయి. మరోవైపు పొట్టి క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడగా 2,364 పరుగులు సాధించారు. ఇక్కడ 17 అర్ధశతకాలు సాధించడం విశేషం. ప్రస్తుతం టీ20, టెస్టులకు దూరమైన మిథాలి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.