పృధ్వీ షా.. మూడుసార్లు 150+స్కోర్

విజయ్‌ హజారే ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాడు పృధ్వీ షా అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో మూడుసార్లు 150+ స్కోర్‌ చేశాడు. గురువారం కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్స్‌లో భారీ శతకం (165; 122 బంతుల్లో 17×4, 7×6) సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా షా(754) నిలవడమే కాకుండా మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన మయాంక్‌ అగర్వాల్‌(723) రికార్డును బద్దలు కొట్టాడు.

పృధ్వీ షా కర్ణాటక బౌలర్లపై చిరుత పులిలా విరుచుకుపడ్డాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ బాట పట్టించాడు. ఈ క్రమంలోనే 48 బంతుల్లో అర్ధశతకం, తర్వాతి 31 బంతుల్లో శతకం, ఆపై మరో 32 బంతుల్లో 150 స్కోర్‌ సాధించాడు. టీమిండియాలో స్థానం కోల్పోయిన కసి.. షా బ్యాటింగ్ లో కనిపించింది. ‌