ఢిల్లీ సరిహద్దుల్లోనే ఇళ్లు కట్టుకుంటున్న రైతులు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా ఆందోళనలు చేస్తున్న రైతులు వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లోనే శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఆందోళనకు చేసేందుకు వీలుగా.. ఇళ్లు కట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలని తాజాగా కిసాన్‌ సోషల్‌ ఆర్మీ నాయకుడు అనిల్‌ మాలిక్ షేర్ చేశారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గతేడాది నవంబరు నుంచి రైతన్నలు దిల్లీ శివారుల్లో బైఠాయించిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. చట్టాలను కొంతకాలం పాటు నిలిపివేస్తామని, వాటిల్లో సవరణలు చేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే రైతులు మాత్రం ఇందుకు అంగీకరించట్లేదు. పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా ఉద్యమం విరమించేది లేదని కరాఖండీగా చెప్పారు.