షర్మిల పార్టీ వెనుక బీజేపీ

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలోనే ఆమె పార్టీ ప్రకటన చేయనున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే ఆమె పదవులు కూడా ఇచ్చేస్తున్నారు, గ్రామ, మండల స్థాయిలో కమిటీలని  నియమిస్తున్నారు. పదవులు ఇచ్చేస్తున్నారు. మరోవైపు కళాకారులు, సమాజంలోని కీలక నేతలని పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు, షర్మిల పార్టీ వెనక ఉన్నది ఎవరు అనే చర్చ జరుగుతోంది.

ముందుగా షర్మిలని వెనకుండి నడిపిస్తున్నది సీఎం కేసీఆర్ నే అనే వాదన వినిపించింది. ఆ తర్వాత షర్మిల పార్టీ వెనకాల ఉన్నది బీజేపీనే వాదనకు బలం పెరుగుతోంది. రాజకీయాలలో తమ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం లేనప్పుడు అవతలి పక్షానికి చెందిన ఓట్లను చీల్చడం అనేది ఎప్పటి నుండో ప్రధాన ఆయుధంగా ఉంది. అయితే ఈ ఆయుధాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో బిజెపి ఇటీవలి కాలంలో రాటు తేలినట్లు కనిపిస్తుంది. బీహార్ లో పోటీ చేసేందుకు ఎంఐఎం ని బీజేపీ ప్రోత్సహించింది. ఇప్పుడు బెంగాల్ లోనూ అదే చేస్తోంది.

ఇప్పుడు.. ఇదే ఫార్ములాని తెలంగాణలో అప్లై చేసేందుకు షర్మిలతో కొత్త పార్టీని ఏర్పాటు చేయిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయ్. షర్మిల పార్టీ వెనుక బీజేపీ ఉందని టీవీ డిబేట్ లలో ప్రొఫెసర్ నాగేశ్వర రావు బలంగా వాదించారు. ఇప్పుడు తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్ది కూడా షర్మిలను తెర వెనకాల బిజెపి నడిపిస్తోందన్నారు. అయినా ప్రస్తుతానికి తెలంగాణలో ప్రాక్టీస్ కోసం మాత్రమే పార్టీ పెట్టిందని, ఇక్కడ ఏడాది పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయవాడకు మకాం మారుతుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. మొత్తానికి.. షర్మిల పార్టీ వెనకాల ఉన్నది బీజేపీ అనే వాదనకు రోజురోజుకు బలం పెరుగుతోంది.