తెలంగాణ మిషన్ విజయవంతమైంది

సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా మరోసారి సంక్షేమ పథకాల వలన అందుతున్న ఫలాలని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ విజయవంతమైన పథకాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మంచినీళ్ల కోసం రూ.4,198 కోట్లు ఖర్చు చేస్తే ఆరున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.32,500 కోట్లు ఖర్చు చేసిందని అసెంబ్లీలో వెల్లడించారు. 


కాకతీయ రాజుల కాలంలో సుమారు 75వేల చెరువులు ఉండేవి. సమైక్య పాలకుల నిర్లక్ష్యం, మౌనం కారణంగా రాష్ట్రంలో కేవలం 46 వేల చెరువులు మాత్రమే మిగిలాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను పటిష్టం చేశాం. భారీ వర్షాలు పడినా ఒక్క చెరువు కూడా తెగకుండా పూర్తిగా నిండిపోయాయి. దీని ద్వారా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు రాష్ట్రంలో వెయ్యి అడుగులు వేసినా నీరు రాని పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో బోర్లు వేసే అవసరం కూడా లేకుండా పోయింది. తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయని ఇటీవలే కేంద్రం నివేదిక ఇచ్చిందని తెలిపారు.