‘అన్నాత్తె’ సెట్లోనే వైద్యులు
గత యేడాది డిసెంబర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ‘అన్నాత్తె’ షూటింగ్ సమయంలో రజనీకి రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయి. హైదరాబాద్ ఆపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. దీంతో ‘అన్నాత్తె’ చిత్రీకరణ నిలిచిపోంది. ఈ కారణంగానే రజనీ పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై కూడా యూటర్న్ తీసుకున్నారు. తాజాగా రజనీ చెన్నైలో జరుగుతున్న అన్నాత్తె షూటింగ్లో పాల్గొంటున్నారట.
ఆయనతో పాటే వైద్యులు కూడా సినిమా సెట్లోనే అందుబాటులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రజనీ అనారోగ్య సమస్యలని దృష్టిలో ఉంచుకొని.. ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పైగా వేసవి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా అన్నాత్తె ప్రేక్షకుల ముందుకు రానుంది.