కొండా కొత్త పార్టీ ఆలోచన వెనక రేవంత్ రెడ్డి ?
కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాన్చుడు ధోరణినే తెలంగాణ కాంగ్రెస్ కొంప ముంచుతుందని చెప్పక తప్పదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చాన్నాళ్లుగా.. కాదు యేళ్లుగా ప్రచారం జరుగుతోంది. చివరుకు ఉత్తమ్ కూడా కానీ కిందపడేశారు. తన వల్ల కాదు కొత్తవారిని నియమించుకోమని అధిష్టానానికి లేఖ కూడా రాశారు. ఆ మధ్య కొత్త పీసీసీ చీఫ్.. అభిప్రాయ సేకరణ, సీనియర్ నేతల బుజ్జగింపు అంటూ హడావుడి చేశారు. కానీ కొత్త పీసీసీ చీఫ్ ని ప్రకటించింది లేదు. అధికార తెరాసకు సవాల్ విసిరింది లేదు.
ఈ నేపథ్యంలో విసిగిపోయిన కొందరు కాంగ్రెస్ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అదే చేశారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయం అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఇస్తూ.. కొత్త పార్టీ పెట్టాలా ? బీజేపీలో చేరాలా ? అనే ఆలోచన చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఈ ఆలోచన వెనక కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ పోస్ట్ కి గట్టి పోటీదారుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొండా రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ తనకి పీసీసీ ఇవ్వకుంటే.. కొండాతో కలిసి కొత్త పార్టీపై కసరత్తు చేసేందుకు రేవంత్ సన్నద్ధం అవుతున్నట్టు సమాచారమ్.
ఇప్పటికే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించింది. దానికోసం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 9న షర్మిల ప్రకటన రానుంది. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే.. తెరాస సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ కూడా కొత్త పార్టీ పెడతారనే ప్రచారం ఉంది. ఆయనకు పార్టీ సీనియర్ నేతల నుంచి సపోర్ట్ ఉందనే టాక్ ఉంది. మొతానికి.. భవిష్యత్ లో తెలంగాణలో మరిన్ని కొత్త పార్టీలు పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.