4 యేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : కేటీఆర్

రానున్న నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 

ఇప్పటికే 60 వేల మందికి దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వగా.. 30 వేల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రానికి కొత్తగా 40 పరిశ్రమలు వచ్చాయని, రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. విద్యుత్‌ వాహనాల 2020- 30 విధానాలు అవలంబిస్తున్నామని తెలిపారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్‌ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.