సురభి వాణిదేవి విజయం.. !

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస బోణి కొట్టబోతుంది.  హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. ప్రొఫెసర్నా గేశ్వరరావుని ఎలిమినేషన్ పూర్తయింది. రెండో ప్రాధాన్యత ఓట్లని కలుపుకొని తెరాస అభ్యర్థి వాణిదేవికి 1,49,269 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ స్థానానికి మేజిక్ ఫిగర్ 1,68,540. దీంతో.. వాణిదేవి విజయం ఖాయమైంది. మరికొద్దిసేపట్లో వాణిదేవీ విజయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు (1,37,566) కంటే వాణి దేవి 11,700 లీడ్ లో ఉంది.

మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మ స్థానానికి సంబంధించి ఉత్కంథ కొనసాగుతూనే ఉంది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,22,639 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో తీన్మార్ మల్లన్న 99,207 ఉన్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరామ్ 83,407 ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోదండరామ్ కి మొదటి ప్రాధాన్యత వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారన్నది ఆసక్తిగా మారింది. భారీగా అంటే.. పల్లా కంటే దాదాపు 25 వేల ఓట్లు అధికంగా మల్లన్నకి వస్తే ఆయన గెలిచినట్టు. లేదంటే ఈ స్థానంలోనూ మరోసారి పల్లా గెలవనున్నారు.