తెరాస గెలుపులో జనసేన పాత్ర ఎంత ?

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లోనూ తెరాసకు బీజేపీ షాక్ ఇచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని గర్జించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు చోట్ల భాజాపా విజయం ఖాయం అనుకున్నారు. భాజాపా గెలవకపోయినా.. తెరాస అభ్యర్థులు మాత్రం గెలవరని భావించారు. కానీ పట్టభద్రులు తెరాసకే పట్టం కట్టారు. రెండు చోట్లా తెరాస అభ్యర్థులని గెలిపించారు. అయితే తెరాస అభ్యర్థుల గెలుపు వెనక జనసేన సపోర్ట్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


పట్టభద్రుల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగానే పడింది. కానీ అది పోలరైజ్ కాలేదు. ఇదీగాక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు జనసేన సపోర్ట్ లభించడం కూడా కలిసొచ్చింది. ఏపీలో భాజాపాతో కలిసి పని చేస్తున్న జనసేన.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీపై అలిగింది. తమని పట్టించుకోవడం లేదని.. స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా ముందుకొచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులని గెలిపించాలని జనసైనికులకు విజ్ఝప్తి చేశారు.

అది తెరాసకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి జనసేన ఓట్లు భారీగానే తెరాసకు పడ్డాయ్. యూత్, పవన్ అభిమానులు వాణిదేవికి ఓటేశారు. నువ్వా-నేనా అన్నట్టు సాగిన పోటీలో జనసేన ఓట్లు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్ లో కూడా తెలంగాణలో జనసేన సపోర్ట్ తెరాసకు దక్కనుందని తెలుస్తోంది.