కొత్త పార్టీ ఏర్పాటుపై హింట్ ఇచ్చిన ఈటెల !

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే.. ఈటెల తన దారి తాను చూసుకుంటారు. కొత్త పార్టీ పెడతారు. ఉద్యమకారులకు పెద్దపీఠ వేస్తూ.. నిజమైన బంగారు తెలంగాణ అజెండాగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నట్టు కథనాలు వచ్చాయ్. ఇవన్నీ గమనించిన సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ని చేసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని చెబుతారు. తాజాగా ఈటెల నుంచి మరోసారి కొత్త పార్టీ ఏర్పాటుపై హింట్స్ వచ్చాయి.


ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల వేదాంత ధోరణితో మాట్లాడారు. ‘ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు..కానీ శాశ్వతంగా ఓడిపోదు. కులం, డబ్బు, పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి. తాను ఇబ్బంది పడుతుండొచ్చు… గాయపడుతుండొచ్చు. కానీ మనసు మార్చుకోలేదు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనను ఎంత గొప్పగా తీసుకెళ్లారో మరిచిపోను. పెట్టే చెయ్యి ఆగదు..చేసే మనిషిని అస్సలు ఆగను” అన్నారు. “పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి” అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు.. ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈటెల  కూల్ గా కనిపిస్తారు. కానీ, అవసరమొచ్చినప్పుడు మాత్రం తనదైన శైలిలో నిరసన గళం వినిపిస్తారు. అది పెద్దగా మండదు. కానీ నొప్పి పెడుతుంది. ఎవరికి తాకలో వారికి తాకుతుంది. గతంలో ఈటెలని మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై స్పందించిన ఈటెల గులాభి జెండాకి అసలైన ఓనర్లం మేం అంటూ గర్జించారు. ఆ గర్జన తర్వాత ఈటెలని టార్గెట్ చేయడానికి భయపడ్డారు. ఆ తర్వాత కూడా ఈటెల మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే టైమ్ దొరికినప్పుడల్లా.. పార్టీ ముఖ్యం కాదు. ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా అంటూ.. కొత్త పార్టీపై హింట్స్ ఇస్తూనే ఉన్నారు ఈటెల. మరీ.. ఈటెల ఎప్పుడు బ్లాస్ట్ అవుతారు? ఎప్పుడు బయటికొస్తారు ?? కొత్త పార్టీ పెడతారా ?? చూడాలి.