జగన్ ఉరుకులాటకు బ్రేకులు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం బలవంతంగానే ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఓ యుద్ధమే చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం విషయాన్ని కోర్టులు అంగీకరీంచలేదు. ఫైనల్ గా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయిష్టంగానే ఎన్నికలకి వెళ్లిన వైసీపీ ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలని సాధించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలని గెలుచుకుంది. 

ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికలకి  కూడా వెళ్లాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయ్. తాజాగా వీటిని విచారించిన ఏపీ హైకోర్ట్.. ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.