బంగారు తెలంగాణకు కొత్త అర్థం చెప్పిన హరీష్
బంగారు తెలంగాణకు అర్థం చెప్పారు మంత్రి హరీష్ రావు. ‘బంగారు తెలంగాణ అంటే బతుకుదెరువు కల్పించడమే’ అన్నారు. శనివారం నెక్లెస్‌రోడ్ హెచ్ఎండీసీ మైదానంలో సంచార చేపల వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల వాహనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ” రాష్ట్రంలోని చెరువులకు మహర్దశ వచ్చింది. గతంలో మత్య్స పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది. ఆ నానుడిని తెరాస ప్రభుత్వం చెరిపేసింది. చేపల దిగుమతి స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. రాష్ట్రంలో మంచినీరు అత్యంత మధురంగా ఉంటుంది. ఇక్కడ మంచినీళ్లలోనే చేపలను పెంచుతున్నారు. మంచినీళ్లలో పెరిగే చేపలకు రుచి, డిమాండ్ ఎక్కువ. తెలంగాణలో చేపలపై వచ్చే ఆదాయం రెట్టింపైంది. మత్య్స పరిశ్రమకు అనుబంధంగా ఇతర పరిశ్రమలను స్థాపిస్తాం” అన్నారు.