ఇందుకే టీఆర్ఎస్’ని తిట్టేది

ప్రజల్లో కేసీఆర్ సర్కారు పట్ల అసంతృప్తి లేదు. కానీ ప్రత్యామ్నాయం వైపు మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. దానికి ఉదాహరణనే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. తెరాస ప్రభుత్వం వచ్చాక.. తెలంగాణ ప్రజల బతుకులు కొంతమేరకు మారాయి. మన బాష, యాసపై గౌరవం పెరిగింది. తెలంగాణ పల్లెలకు తాగునీరు, సాగు నీరు వస్తోంది. కరెంట్ కోతల్లేవ్. 24 గంటలు వెలుగులే. పైగా రైతుబంధు, రైతుభీమా అందుతోంది. 

మరెందుకు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ? అంటే.. పేదలకు పెట్టేది పావులా.. పెద్దోళ్లకి ఇచ్చేది బారానా అని అనుకుంటున్నారు. ఎకరం ఉన్నోడు, వందెకరాలు ఉన్నోడికి రైతుబంధు ఇవ్వబడితివి అనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇలాంటిదే తాజాగా మరో ఉదాహరణ వచ్చింది. జ‌బ‌ర్‌ద‌స్త్‌తో పాపుల‌ర్ అయ్యాడు ముక్కు అవినాష్‌. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మ‌రింత ఆద‌ర‌ణ సంపాదించాడు. అలాంటి సెలబ్రిటీకి సీఎం సహాయనిధి కింద రూ. 60వేలు ఇవ్వడం విమర్శలకు తావునిచ్చింది.

ఇటీవ‌ల ముక్కు అవినాష్ త‌ల్లి ల‌క్ష్మీ రాజం అనారోగ్యానికి గురైంది. ఆమె ఆసుప‌త్రి ఖ‌ర్చుల నిమిత్తం తెలంగాణ ప్ర‌భుత్వం 60 వేల ఆర్థిక స‌హాయాన్ని అందించింది. అందుకు సంబంధించిన చెక్కుని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్.. అవినాష్‌కి ఇవ్వ‌డం, ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.వైద్య స‌హాయం కోసం 60 వేలు అందించ‌డం త‌ప్పు కాదు. కానీ అదెవ‌రికి అనేది ప్ర‌ధానం. అవినాష్ ఏమీ తిండికి గ‌తిలేనివాడు కాదు. క‌టిక పేద‌రికంలో లేడు. 60 వేలు త‌న‌కు పెద్ద క‌ష్ట‌మైన విష‌యం కాదు. ఒక్క షో లో పాల్గొంటే 50 వేలు సంపాదించుకోగ‌ల‌డు. అలాంటిది త‌ల్లికి 60 వేల‌తో వైద్యం చేయించుకోలేడా? ఆ స‌హాయం కూడా ప్ర‌భుత్వం అందించాలా?  అని ప్రశ్నిస్తున్నారు.