సారు.. మళ్ళీ సన్నరకం పాట !
తెలంగాణ రైతులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సారి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రభుత్వం పంటని కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో తెలంగాణ రైతులు ఆనందపడుతున్నారు. ఇంతలో మరో మింగిడుపడని మాట కూడా కేసీఆర్ సర్కారు చెప్పింది. అదే వరి సన్నరకం సాగు. గత యేడాది రైతులందరూ..వరి సన్నరకం సాగు చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం సూచన మేరకు రైతులు అదే సాగు చేశారు. కానీ, ఆ సన్నరకం వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బయట అమ్ముకుందామంటే.. ధర తక్కువ పలికింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే ఈ సారి కూడా వరి సన్నరకాన్నే సాగు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఒకరిని చూసి ఒకరు వరి సాగు చేయకపోవడమే మంచిదన్నారు. వానాకాలంలో పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు బ్యాంకు పూచికత్తు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
”యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోటీ 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎఫ్‌సీఐ 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తోంది. మిల్లర్లు 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారు. విత్తనాల కంపెనీలు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాయి. పొరుగు రాష్ట్రాల మిల్లర్లు 10 లక్షల మెట్రిక్ టన్నులు కొంటారు. తేమ శాతం, తాలు నిబంధలకు లోబడి ధాన్యం తేవాలి. పత్తి సాగు విస్తీర్ణం 70 నుంచి 75 లక్షల ఎకరాలకు పెరగాలి. తెలంగాణ పత్తికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది” అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు