బాహుబలి డైలాగ్ కొట్టిన దీదీ

దేశంలో భాజపాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంటుందన్నారు  తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. ఈ మేరకు భాజపాయేతర పార్టీల కీలక నేతలకు లేఖలు రాశారు. భాజపాయేతర పార్టీలు తమ రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను వినియోగించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నిర్వీర్యం చేయడం ద్వారా వాటిని మున్సిపాల్టీల స్థాయికి పతనంకావాలని భాజపా కోరుకుంటోందన్నారు. అలాగే, దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించాలనుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా ఏకంకావాల్సిన సమయం ఆసన్నమైందని తాను గట్టిగా నమ్ముతున్నాం. ఈ పోరాటంలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు దీదీ తెలిపారు. తనతో పాటు కలిసి రావాలని భాజేపాయేతర పార్టీలని కోరారు. ఒక్కమాటలో చెపాలంటే.. భాజాపాపై పోరాటానికి నాతో కలిసి వచ్చేదెవరు ? అంటూ బాహుబలి డైలాగ్ కొట్టారు అన్నమాట.

దీదీ లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు.