ఆ దేశాలు మళ్లీ లాక్డౌన్
కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని దేశాల్లో వైరస్ విజృంభణ.. అక్కడ మరోసారి ‘లాక్డౌన్’కు దారితీసింది. ఇప్పటికే ఫ్రాన్స్ సహా పలు దేశాలు లాక్డౌన్ విధించగా.. తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఏప్రిల్ 5వ తేదీ సోమవారం నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే అక్కడ మూడో దశ విజృంభణ కొనసాగుతుంది. దీంతో ఆ దేశం లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్ , బంగ్లా దేశాల దారిలోనే పోలాండ్, బెల్జియం మరోసారి లాక్డౌన్ ని ఆశ్రయించాయి. పోలాండ్ లో మూడు వారాలు, బెల్జియంలో నాలుగు వారాలపాటు లాక్డౌన్ విధించారు.