తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌.. ఓ వ్యక్తి అరెస్ట్ !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అన్నీ రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. అయినా.. తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ అనే ప్రచారనికి పులిస్టాప్ పడటం లేదు. 


తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ అంటూ.. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాజాగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్తి వివరాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వివరించారు. 4 రోజుల క్రితం శ్రీపతి సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను తయారు చేసినట్లు తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో రాత్రి వేళల్లో లాక్‌ డౌన్‌ విధిస్తారంటూ నకిలీ జీవో తయారు చేసి, సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్‌ చేశారన్నారు.  నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఇలాంటి ఫేక్ ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్బంగా సీపీ హెచ్చరించారు.