IPL14 క్యాన్సిల్.. డౌట్స్ క్లియర్ !
కరోనా విజృంభణతో గత యేడాది ఐపీఎల్ (#IPL13) విదేశాలకు వెళ్లింది. యూఏఈ వేదికగా #IPL13 జరిగిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే ముగిసింది. కానీ విజయవంతం అయింది. అయితే ఆర్నెళ్లు తిరగకుండా ఐపీఎల్ మరో సీజన్ రావడంతో క్రికెట్ ప్రేమికులు ఆనందపడ్డారు. ఈ సారి స్వదేశంలో.. మైదానాలకి వెళ్లి పొట్టి క్రికెట్ ని ఆస్వాదించవచ్చు అనుకున్నారు. కానీ #IPL14 ముందు దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది.
స్టేడియాలకు, ఆటగాళ్లకు కరోనా సోకుతోంది. ఇప్పటికే పలువురు స్టేడియం సిబ్బంది, ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. ఫ్రాంఛైజీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆటగాళ్లు కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్ తప్పకపోవచ్చు. #IPL14 క్యాన్సిల్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై బీసీసీఐ బాస్ గంగూలీ ఆదివారమే క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో #IPL14 జరుగుతుందని స్పష్టత ఇచ్చారు.
తాజాగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా #IPL14 వాయిదా పడే ఛాన్సే లేదన్నారు. అయితే ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించడం లేదని తెలిపారు. అలాగే ఆటగాళ్లు, టోర్నీతో సంబంధం ఉన్న వాళ్లు.. వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక హోటల్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉండనుంది.