మరోసారి సీఎంలతో ప్రధాని భేటీ
దేశంలో కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా… అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేస్తున్నారు. కరోనా కట్టడికి కోసం సలహాలు స్వీకరిస్తున్నారు. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. గతేడాది కరోనా ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత మార్చి 17న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన మోదీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఐతే మరోసారి ప్రధాని సీఎంలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 8న గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో భేటీ కానున్న ప్రధాని.. కొవిడ్ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ భేటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ, థియేటర్స్, బార్లు మూసివేతపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు.