‘రిపబ్లిక్’ టీజర్ టాక్
మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ పొలిటికల్ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తొలిసారి ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవకట్ట దర్శకత్వం వహిస్తున్నారు. ‘రిపబ్లిక్’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తేజుకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజకీయాల్లో నేనింతే. నేను ఏం చేసిన నడుస్తది అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ ని వదిలారు. “ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాలని వేరు చేయలేం” అని జార్జ్ ఆర్వేల్ చెప్పిన కొటేషన్ తో టీజర్ ప్రారంభం అయింది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓ హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకున్నా కూలిపోతున్న వ్యవస్థలే.. ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా.. ఇంకా ప్లూడన్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు.. సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా.. ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు’ అంటూ తేజు చెప్పిన వాయిస్ ఓవర్ తో టీజర్ సాగింది. సింపుల్ గా సినిమా లైన్ చెప్పే ప్రయత్నం టీజర్ తో చేశారు. చివరలో.. ‘వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు.. అందరు కరెప్టే సర్..’ అని తేజు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. జూన్ 4న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు టీజర్ లోనే చెప్పేశారు.