పవన్ పారితోషికం.. నిమిషానికో కోటి !

వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ వారమే (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సినిమాలో పవన్ ఎంత సేపు కనిపిస్తాడు ? ఆయన ఎంట్రీ ఎప్పుడు ? ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయ్. ఎందుకంటే ? ఇది బాలీవుడ్ హిట్ పింక్ కు రిమేక్. ఇందులో బిగ్ బీ అమితాబ్ కనిపించిన పాత్రలో పవన్ కనిపించనున్నారు.

‘పింక్‌’లో.. సినిమా ప్రారంభ‌మైన చాలాసేప‌టి వ‌ర‌కూ అమితాబ్ రాడు. ఆయన పాత్ర నివిడి చాలా తక్కువ. అందుకే వకీల్ సాబ్ లో పవన్ ఎంత సేపు కనిపిస్తారు ? అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు. వారి ఆరాలో ప‌వ‌న్ కేవ‌లం 50 నిమిషాలే క‌నిపించ‌బోతున్నాడ‌ని తేలింది. ఈ సినిమా కోసం ప‌వ‌న్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడ‌ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. 50 నిమిషాల కోసం 50 కోట్లంటే.. నిమిషానికి కోటి రూపాయ‌ల‌న్న‌మాట. అన్నట్టు.. పవన్ 42 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇక వకీల్ సాబ్ నిడివి 2 గంట‌ల 30 నిమిషాలుగా ఉండనుంది. పవన్ కనిపించేది 50 నిమిషాలే.. అయినా.. ప‌వ‌న్ తెర‌పైకొచ్చిన‌ప్పుడ‌ల్లా… ఆయ‌న అభిమానుల‌కు పూన‌కాలు తెచ్చేలా సీన్స్ ఉంటాయ‌ట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ నిర్మాత దిల్ రాజు అదే చెప్పారు. ప్రతి పది నిమిషాలకోసారి.. పవన్ అభిమానులకి పూనకం తెప్పించే సీన్ ఒకటి వస్తుందని. ఇది ముగ్గురు అమ్మాయిల క‌థ‌. ఎక్కువ భాగం వాళ్ల చుట్టూనే న‌డుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ పాత్ర నిడివి పెంచితే.. కథ ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. అందుకే అభిమానులకు నచ్చదని తెలిసినా.. పవన్ పాత్రని 50 నిమిషాలకే పరిమితం చేశారని తెలుస్తోంది.