లాక్‌డౌన్ ని ఆశ్రయించిన మరో రాష్ట్రం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షల బాటపట్టాయి. ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహరాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్, రాత్రికర్ఫ్యూ విధించగా.. గుజరాత్, దిల్లీ కూడా కర్ఫ్యూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వారాంతపు లాక్‌డౌన్ విధించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అక్కడ నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.18లక్షలు దాటింది. ప్రధాన నగరాలైన ఇండోర్, భూపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్ కు వెళ్లక తప్పలేదు.