కేంద్రం ముందు క్రేజీవాల్ కొత్త ప్రపొజల్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు లక్ష దాటేసి.. లక్షన్నరకు చేరుకున్నాయ్. ప్రతిరోజూ కరోనా కాటుకు వందల మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలని కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అంతేకాదు.. ఈరోజు నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. 45యేళ్లకు పైబడిన వారంతా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం ముందు ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కొత్త ప్రపొజల్ పెట్టారు. అదేటంటే.. ? టీకా తీసుకోవడంపై ఉన్న వయసు పరిమితిని ఎత్తివేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా అందించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి గొలుసును తుంచేయాలంటే ప్రతిఒక్కరికీ టీకా ఇవ్వడం తప్పదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలని విధిస్తోంది. పూర్తిస్థాయి లాక్‌డౌన్ పెట్టకున్నా.. నిబంధనలని కఠినతరం చేసింది. నిక మెట్రో రైళ్లు, బస్సులు.. సీట్ల సామర్థ్యంలో 50 శాతం ప్రయాణికులతో నడవనున్నట్లు ప్రకటించింది. వివాహాల్లో అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సంస్కృతిక సంబంధ సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెస్టారెంట్లు, బార్లు సైతం 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టంచేశారు.