ఢిల్లీ-రాజస్థాన్.. ఎవరి బలాలేంటీ ?
ఐపీఎల్ 14 క్రికెట్ ప్రేక్షకులకి అసలుసిసలు మజాని పంచుతోంది. మొన్న ఓడుతుందనుకున్న ముంబై గెలిచేసింది. నిన్న గెలుస్తుందనుకున్న సన్ రైజర్స్ ఓడింది. మ్యాచ్ లు అనూహ్యంగా మలుపు తిరిగుతూ.. మజాని పంచుతున్నాయ్. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్.. మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మీద నెగ్గగా, రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఓడింది. ఇక తన రెండో మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుతో రాయల్స్ జట్టు ఉంది. అయితే స్టోక్స్ లేకుండా ఈసారి బరిలోకి దిగుతోంది. మరోవైపు గెలుపుపై ఢిల్లీ ధీమాగా ఉంది. ఆ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృధ్వీ షా పెట్టిన కోటగా మారారు. భీకర ఫాంలో ఉన్నారు. ఒకవేళ వీరిద్దరు త్వరగా అవుటైనా.. కెప్టెన్ రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్‌మెయర్ లు ఉన్నారు. వీరు విఫలమైన ఢిల్లీ వాల్ అజింక్య రహానే ఉన్నాడు. క్రిస్ వోక్స్, టామ్ కరన్, రవిచంద్రన్ అశ్విన్‌ల వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది.
బౌలింగ్ లోనూ ఢిల్లీ పటిష్టంగానే కనిపిస్తోంది. గత మ్యాచ్ లో అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు కీలకమైన వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 5.75 మాత్రమే. అటు క్రిస్ వోక్స్ కూడా 6.00 ఎకానమీతో రెండు వికెట్లు సాధించడంతో దిల్లీ పేస్ దళం బాగానే కనిపిస్తోంది. గత మ్యాచ్ లో విఫలమైన అశ్విన్, అమిత్ మిశ్రాలు మంచి బౌలర్లే. తమదైన రోజున మ్యాచ్ నే మలుపు తిప్పగలరు.
ఇక రాజస్థాన్ జట్టు బలంగానే ఉంది. ఈరోజు మ్యాచ్ లో స్టోక్స్ లేడు. బట్లర్ ఓపెనింగ్ చేయనున్నాడు. గత మ్యాచ్‌లో సంజు శాంసన్ (119) అద్భుత శతకంతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. శివమ్ దుబే, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ బ్యాట్ ఝులిపిస్తే.. ఢొకా ఉండదు. బౌలింగ్ విషయానికొస్తే.. సకారియా, మోరిస్, ముస్తాఫిజుర్, తెవాతియా, దుబే కట్టుదిట్టమైన బౌలింగ్ చేయాల్సి ఉంది. అప్పుడే బలమైన ఢిల్లీని గట్టిగా ఢికొట్టగలరు.