నటుడు వివేక్ మృతికి కరోనా టీకానే కారణమా ?
కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే వివేక్ మృతికి కరోనా టీకానే కారణమనే అనుమానాలు కూడా తలెత్తాయ్. గురువారమే వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. శుక్రవారం ఉదయం సాలి గ్రామంలోని తన ఇంట్లో శ్వాస ఆడడంలేదని చెబుతూనే కిందపడి స్పృహ కోల్పోయారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కోవిడ్ టీకా వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే టీకాకు గుండెపోటు సంబంధం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్న క్రమంలో శనివారం ఉదయం వివేక్ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
వివేక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తెలుగు, తమిళ్ ద్విబాషా చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అపరిచితుడు, శివాజీ చిత్రాల్లో వివేక్ చేసిన కామెడీని తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు. 2009లో ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. వివేక్ మృతితో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.