తెరపైకి ఢిల్లీ లాక్డౌన్ డిమాండ్
దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజూకి కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. ఇక దేశంలో అత్యదిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి.గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 24,375 కేసులు నమోదు కాగా, 167 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో 15రోజుల పాటు ఢిల్లీలో లాక్డౌన్ విధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆలిండియా ట్రేడర్స్ ఫెడరేషన్(సీఏఐటీ) ఈ డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆదివారం లేఖ రాసింది.
‘దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దిల్లీలోనూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దిల్లీ పౌరుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని కరోనా ముప్పును నివారించేందుకు లాక్డౌన్ విధించాలి. తక్షణమే 15 రోజుల పాటు దిల్లీలో లాక్డౌన్ అమలు చేయాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు సహా దిల్లీ సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. బయటి ప్రాంతాల నుంచి కొవిడ్ సోకిన వ్యక్తులు ఎవ్వరూ దిల్లీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొంది.