ప్రజలకు పవన్ కరోనా విజ్ఝప్తి

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఐతే పవన్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ? అనే ఆందోళనలో ఆయన అభిమానులున్నారు. వారి ఆందోళనలు అర్థం చేసుకొన్న జనసేన పార్టీ.. పవన్ ఆరోగ్యంపై ఓ ప్రత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో తాను బాగున్నా. త్వరలోనే మీ ముందుకు వస్తానని పవన్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు, ప్రభుత్వానికి పవన్ కరోనా సూచనలు చేశారు. 

“ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నాను. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తాను. నేను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి నా యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సందేశాలు పంపించారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 

జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను. కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు సూచించారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలి” అన్నారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది…
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/SCkgTBFHpp— JanaSena Party (@JanaSenaParty) April 18, 2021