రీఇన్‌ఫెక్షన్ల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయా ?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. లక్షల్లో కేసులు.. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కేసులు భారీగా పెరగడానికి.. రీఇన్‌ఫెక్షన్లే కారణమై ఉండొచ్చని ఆరోగ్య, అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త ప్రొఫెసర్ అనుప్ మలానీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. కరోనా టీకా తీసుకున్నామని ధీమాగా ఉండటం కరెక్ట్ కాదు. టీకా తీసుకున్న వ్యక్తికి కరోనా సోకదని చెప్పలేం అన్నారు. అయితే అతడిలో వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, వేగంగా నయం కావడానికి వ్యాక్సిన్ దోహదపడుతుందని తెలిపారు.
‘గతంలో ఒకసారి కొవిడ్ సోకడం, టీకాలు పొంది ఉండటం వల్ల ఆ మహమ్మారి నుంచి రక్షణ లభించదు. అయితే ఆ రెండు అంశాల వల్ల లభించిన రోగనిరోధక శక్తి చాలా ప్రయోజనకరం. అలాంటివారికి ఇన్‌ఫెక్షన్ సోకితే వేగంగా నయమవుతుంది. దీనివల్ల మరణాలు, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించవచ్చు’ అని వివరించారు. మాస్కులు ధరించడం, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడం, వ్యాధి సోకినవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, పాజిటివ్ కేసుల్లో వైరస్ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా కరోనా రెండో ఉద్ధృతిని ఎదుర్కోవచ్చని అనుప్ చెప్పారు.