రెండేళ్లలో అధికారంలోకి షర్మిల పార్టీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది వైఎస్ షర్మిల పార్టీనే. రాసిపెట్టుకోండి. అది కూడా రెండేళ్లలోనే. అంటే.. 2023లో తెలంగాణలో షర్మిల పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నమాట. ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. స్వయంగా షర్మిలనే. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా ఆమె మూడ్రోజుల నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

తాజాగా షర్మిల దీక్షని విరమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు నియోజకవర్గాల్లో మా కార్యకర్తలు దీక్షలు చేస్తారు. రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏం చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మాటిస్తున్నా”నన్నారు.

తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ రెండు రోజుల కిందట ఇందిరా పార్క్‌ వద్ద షర్మిల ఉద్యోగ దీక్ష చేపట్టింది. పోలీసులు ఒక్క రోజు దీక్షకే అనుమతించినా 72 గంటలు కొనసాగిస్తానని షర్మిల ప్రకటించడంతో పోలీసులు అడ్డుకొని ఆమె నివాసానికి తరలించారు. దీంతో ఆమె నివాసంలోనే దీక్ష కొనసాగించారు.