ప్రకాష్ రాజ్ మెగా భజన వెనక !

‘వకీల్ సాబ్’ రిలీజ్ తర్వాత ప్రకాష్ రాజ్ మెగా భజన మొదలెట్టారు. పవన్ కల్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని మోస్తున్నారు. ఇది నిజంగానే అభిమానమేనా అంటే..? కాదు. దీని వెనక ‘మా’ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. మా పదవి కాలం త్వరలో పూర్తి కానుంది. ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్రకాష్ రాజ్ భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ మద్దతు ఉన్న వారికే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నది ఓపెన్ సీక్రెట్.

ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మెగా పొగడ్తలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కు రాజకీయంగా మంచి పరిచయాలున్నాయ్. ఆయన సీఎం కేసీఆర్, తెరాస పాలనకు అభిమాని. ఇండస్ట్రీలోనూ ప్రకాష్ రాజ్ కు మంచి పరిచయాలు, పేరుంది. ఆయన అనుకుంటే మా అధ్యక్ష పదవి పెద్ద కష్టమేమి కాదు. కానీ ప్రకాష్ రాజ్ పోటీ కోరుకోవడం లేదు. ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిగా ఎన్నుకోబడాలని అనుకుంటున్నారు. అది జరగాలంటే మెగా కాంపౌండ్ సపోర్ట్ అవసరం. అందుకే.. వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగమని.. మెగా భజన చేస్తున్నారు.. ఈ సీనియర్ నటుడని చెప్పుకుంటున్నారు. ఆలోచిస్తే.. ఇందులోనూ నిజం లేకపోలేదేమో.. !