నెవ‌ర్ బిఫోర్ అవ‌తారంలో బాలయ్య

బాలయ్య రంగంలోకి దిగితే దబిడి దిబిడే. తనకు ఎదురొచ్చినా.. తాను ఎదురెళ్లినా.. అంటూ బాలయ్య తెరపై ఇరగదీస్తాడు. అందుకే బాలయ్య లాంటి హీరో దొరికితే.. ఫ్యాక్షన్, యాక్షన్ మిక్స్ చేసి కథలు రాసుకుంటారు. డైలాగ్స్ కి మరింత పదను పెడతారు. బోయపాటి శ్రీనులా. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం బాలయ్య కామెడీ చేసేశాడట. అసలు విషయం ఏంటంటే ? బాలయ్యతో రావిపూడి సినిమా ఫిక్సయింది. 

వాస్తవానికి బాలయ్య వందో సినిమా కోసం పోటీ పడిన దర్శకుల్లో అనిల్ ఒకరు. బాలయ్య కోసం రామారావు కథని రాసుకున్నాడు. అది బాలయ్యకు నచ్చింది. కానీ దాన్ని వందో సినిమాగా తీసుకురావడం కుదర్లేదు. అప్పటి నుంచి బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా అంటూ.. వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు అది ఫిక్సయింది. అయితే బాలయ్యతో రొటీన్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ కాకుండా.. డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట. బాల‌య్య‌ని నెవ‌ర్ బిఫోర్ అవ‌తారంలో చూపించబోతున్నాడట. 

త‌న బ‌లం.. కామెడీ. సో… దాన్ని వ‌ద‌ల‌కుండా బాల‌య్య‌తో వినోదం పండించ‌బోతున్నాడ‌ట‌. యాక్ష‌న్ కంటే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని, బాల‌య్య గెట‌ప్, క్యారెక్ట‌రైజేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ.. ఇవ‌న్నీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయని సమాచారమ్. మరీ.. గతంలో బాలయ్య కోసం రాసుకొన్న కథలోనే.. కామెడీ డోస్ ఇంకాస్త పెంచారా.. ? లేక కొత్త కథతో వస్తున్నాడా ?? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మనిలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది. క్రాక్ తర్వాత గోపీ చేయబోతున్న సినిమా ఇది. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ నే. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో సినిమా ఉండనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.