రోహిత్ కు ఫైన్ పడింది

మ్యాచ్ పోయింది. పైగా ఫైన్ కూడా పడింది. ఇది ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు జరిగింది. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ముంబై ఓడిన సంగతి తెలిసిందే.  మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన..అమిత్‌ మిశ్రా (4/24) అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్‌ (45; 42 బంతుల్లో 5×4, 1×6), స్మిత్ (33; 29 బంతుల్లో 4×4), లలిత్‌ యాదవ్ (22 నాటౌట్‌; 25 బంతుల్లో 1×4) రాణించారు. 

ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ స్లో ఓవర్‌ రేట్ నమోదు చేసింది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం.. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది రెండోసారి రిపీటైతే.. రూ.24 లక్షల ఫైన్ తో పాటు.. జట్టు కెప్టెన్‌ సహా ఆ మ్యాచ్‌కు తుది జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా స్లో ఓవర్‌ రేట్ నమోదు చేస్తే.. ఆ కెప్టెన్‌ను ఒక మ్యాచ్‌ నిషేదం విధించడంతోపాటు రూ.30 లక్షల జరిమానా వేస్తారు.