అంజనాద్రినే ఆంజనేయుని జన్మస్థలం : TTD

ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాలతో సహా నిరూపితమైనట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు.
ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు తితిదే కమిటీని ఏర్పాటు చేసింది. ‘హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నాం. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు’ అని మురళీధర శర్మ వెల్లడించారు.