దేశంలో 3లక్షలు దాటిన కొత్త కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 2,104 మంది కరోనాతో మృతి చెందారు. దాంతో మొత్తం కేసులు 1,59,30,965కి చేరగా..1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 22లక్షలకు పైబడగా.. ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 1,78,841 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో కోటీ 34లక్షల మంది వైరస్ను జయించగా..రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయింది.
ఒకానొక దశలో అగ్రదేశం అమెరికాలో మాత్రమే మూడులక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆ తరవాత ఆ స్థాయి విజృంభణ భారత్లోనే కనిపిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. ఇక దేశంలో (2,104) ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దేశంలో లక్ష కేసులు నమోదై వారం రోజులు కూడా అవ్వలేదు.. అప్పుడే ఆ సంఖ్య 3లక్షలు దాటిపోయింది. రాబోయే ఒకట్రెండు వారాల్లో ఈ సంఖ్య 5లక్షలకి చేరిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రజలు స్వయంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్ డౌన్ వరకు వెళ్లే పరిస్థితులు తెచ్చుకోకూడదని కేంద్రం చెబుతోంది.