అభిషేక్-ఐశ్వర్య’ల ప్రేమ కహాని

స్నేహం.. ప్రేమ.. పెళ్లి – ఇదే అభిషేక్-ఐశ్వర్య’ల ప్రేమ కహాని. 14 సంవత్సరాల క్రితం పెద్దల అంగీకారంతో ఈ ప్రేమజంట వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ తమ ప్రేమకథ ఎలా మొదలైంది.. ఐష్‌ని తాను మొదటిసారి ఎప్పుడు కలిశారో చెప్పారు.

“నాన్న నటించిన ‘మృత్యుదాత’ చిత్రానికి నేను ప్రొడెక్షన్‌ బాయ్‌గా పనిచేశాను. ఆ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలను న్యూజిలాండ్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం భావించింది. అదే సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు బాబీ డియోల్‌ ఆ దేశంలో తన మొదటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

నేను కూడా న్యూజిలాండ్‌లోనే ఉన్నానని తెలుసుకున్న బాబీ ఓసారి ఫోన్‌ చేసి డిన్నర్‌కి రమ్మని పిలిచాడు. డిన్నర్‌కి వెళ్లినప్పుడు బాబీ.. నాకు ఐశ్వర్యని పరిచయం చేశాడు. తాను తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమే కథానాయిక అని చెప్పాడు. అలా మొదటిసారి నేను – ఐష్‌ కలుసుకున్నాం. మాట్లాడుకున్నాం. తర్వాత కొన్నాళ్లకు స్నేహం.. ప్రేమ.. పెళ్లి జరిగింది” అని  చెప్పుకొచ్చాడు.