పది పరీక్షలు.. ఏపీ సర్కార్ తగ్గింది !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్ పరీక్షలని వాయిదా వేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ లని ఆశ్రయిస్తున్నాయి. ఐతే, ఇందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలని నిర్వహించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మేలో ఇంటర్, జూన్ లో పది పరీక్షలని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలొచ్చినా.. తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లోనూ వ్యతిరేకత మొదలైంది.
ఈ నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.